Treasure Hunt | అత్తామామల అత్యాశకు.. కూతురు, అల్లుడు బలి

Treasure Hunt | అత్తామామల అత్యాశకు.. కూతురు, అల్లుడు బలి

Treasure Hunt | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడలో ఆదివారం దంపతులు వడ్ల బాలసాయి (32), పద్మ (26) ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి సోదరుడు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలసాయి, పద్మ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం పటేల్‌గూడలో నివసిస్తున్నారు. పెళ్లి తర్వాత అత్తింటికి వెళ్లిన సమయంలో ఇంట్లో నిధి ఉందని, దాన్ని వెలికితీయడానికి రూ.10 లక్షలు అవసరమని అత్త శాంతమ్మ, మామ చంద్రయ్య, తోడల్లుడు వెంకటేష్ బాలసాయిని నమ్మించినట్లు దర్యాప్తులో తేలింది.

దీంతో బాలసాయి నాలుగు నెలల క్రితం పరిచయస్తుల వద్ద అధిక వడ్డీకి రూ.10 లక్షలు అప్పు చేసి అత్తామామలకు ఇచ్చాడు. అనంతరం ఇంట్లో తవ్వకాలు చేపట్టినా ఎలాంటి నిధి లభించలేదు. అప్పిచ్చిన వారు డబ్బు కోసం ఒత్తిడి చేయగా, అత్తామామలను పలుమార్లు అడిగినా సొమ్ము తిరిగి ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు.

అప్పుల ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు తమ స్వగ్రామం జన్వాడకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ఐదు నెలల పసికందు ఉండటం ఈ ఘటనను మరింత విషాదంగా మార్చింది.

దర్యాప్తులో భాగంగా బాలసాయి మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు, అందులో ఉన్న సూసైడ్ మెసేజ్‌ను గుర్తించారు. అందులో తమ మరణానికి అత్త, మామలే కారణమని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆధారాల ఆధారంగా శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.