30thJuneeditorial | భారత్ అభ్యంతరాలను పట్టించుకోని చైనా

30thJuneeditorial | భారత్ అభ్యంతరాలను పట్టించుకోని చైనా

30thJuneeditorial | తీస్తా ప్రాజెక్టులో చైనా జోక్యం..
భారత్‌కు వ్యూహాత్మక సవాలు
బంగ్లాదేశ్-చైనా సాన్నిహిత్యం..
సిలిగురి కారిడార్‌పై పెరుగుతున్న ఆందోళనలు

30thJuneeditorial | చైనాతో బంగ్లాదేశ్ మరింత దగ్గరవుతోంది. ఇటీవల మోంగ్లా నౌకాశ్రయం నిర్మాణానికి ఇరు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు తీస్తా నది సమగ్ర నిర్వహణ విషయంలో బంగ్లాకు సహకరించేందుకు చైనా ముందుకు వచ్చింది. ఇది సిలిగురి కారిడార్‌లో భారత్‌కు అతి సమీపంలో ఉంది. అందుకే మన దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మోంగ్లా నౌకాశ్రయం, ఇప్పుడు తీస్తా నది సమగ్ర నిర్వహణ ప్రాజెక్టు రెండింటినీ కూడా భారత్ సహకారంతో అభివృద్ధి చేసేందుకు బంగ్లాదేశ్ గతంలో ఒప్పందాలు కుదుర్చుకుంది. బంగ్లాలో అధికారం చేతులు మారడం, భారత్ వ్యతిరేక ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. సిలిగురి కారిడార్‌లో చైనా ప్రభావం పెరిగితే దేశ భద్రతకు ప్రమాదం అని మన దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

దీనిపై మన దేశం అభ్యంతరాలను వ్యక్తం చేసినా చైనా ఖాతరు చేయలేదు. భారత్ ఆందోళనలను చైనా పక్కనపెడుతూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మూడో దేశం ప్రమేయం లేకుండానే బంగ్లాతో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని స్పష్టం చేసింది.

అంతేకాదు, బంగ్లాదేశ్‌లో 15 నదీ జలాల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి సాయం అందిస్తామని చైనా స్పష్టం చేసింది. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకుని తాము బంగ్లాకు సాయం అందించేందుకు ముందుకు రావడం లేదని, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాయం అందించాలని నిర్ణయించుకున్నామని చైనా తెలిపింది.

తీస్తా నది పరీవాహక ప్రాంతం మన ఈశాన్య రాష్ట్రాలకు సమీపంలో ఉండటం వల్ల చైనా ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని మన దేశం ఆందోళన చెందుతోంది. తీస్తా నది సమగ్ర శుద్ధి, అభివృద్ధి విషయంలో బంగ్లాదేశ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ కారణంగా బంగ్లాదేశ్‌కు అండగా నిలబడటంలో తప్పులేదని భావిస్తున్నామని చైనా వివరించింది.

తీస్తా నది బంగ్లాదేశ్‌కు అత్యంత జీవనోపాధికి ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా భావిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు. అభివృద్ధి వ్యూహాల్లో బంగ్లాతో మరింత సమన్వయం సాధించడానికి చైనా కృషి చేస్తోందని జియాకున్ తెలిపారు.

చైనా పర్యటనకు వచ్చినప్పుడు పూర్వపు బంగ్లా ప్రధాని మహ్మద్ యూనస్ చైనీస్ నాయకులతో చర్చలు జరిపిన సంగతిని ఆయన గుర్తుచేశారు. తీస్తా ప్రాజెక్టుపై ఇరు దేశాల నీటి పారుదల శాఖల నిపుణులు అధ్యయనం చేస్తారని కూడా ఆయన చెప్పారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ మంత్రి ఖలీలూర్ రెహమాన్ ధ్రువీకరించారు.

తీస్తా ప్రాజెక్టుపై హసీనా బంగ్లా ప్రధానిగా ఉన్నప్పుడు ఆమెతో మన ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. అయితే, ఆనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుముఖత చూపకపోవడం వల్ల తీస్తా ప్రాజెక్టు ఆగిపోయింది. దానిని చైనా ఇప్పుడు అవకాశంగా తీసుకుంది.

బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారత్ సాయం అందించిన సంగతిని మరచిపోవడం బంగ్లా నాయకులు అనుసరిస్తున్న నీతిబాహ్యమైన చర్య. అయితే, భారత్‌ను కవ్వించేందుకు చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. అంతేకాక, బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్‌కు మరింత దగ్గరవుతోంది. భారత్‌పై అసత్యాలను ప్రచారం చేస్తోంది. భారత్‌ను అన్ని విధాలా ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్ చేస్తున్న పన్నాగాలను బంగ్లాదేశ్ సమర్థిస్తోంది. ఇదంతా పూర్వపు బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చిందనే దుగ్ధంతోనే.