TechTOK | యూజర్ నేమ్ రిజర్వ్ చేసుకున్నారా.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. !!
- ఇక ఫోన్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదు..!
- వాట్సాప్‌లో ఇక యూజర్‌నేమ్‌తో చాట్..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తి, కాలేజీ క్లాస్‌మేట్, పొరుగింటి వారు లేదా ఏదైనా ఈవెంట్ లో కలిసిన వారితో వాట్సాప్ లో మాట్లాడాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ పంచుకోవాల్సి వచ్చేది.
అయితే ఇకపై ఆ అవసరం ఉండదు. వాట్సాప్ యూజర్స్ ప్రైవసీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. మిగితా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మాదిరిగానే ‘యూజర్‌నేమ్’తో చాట్ చేసే ఫీచర్ ని వాట్సాప్ తీసుకురాబోతోంది. దీంతో వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను అపరిచితులు లేదా వ్యాపార సంస్థలతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్‌ను ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి తీసుకురానుండగా, ఇప్పటి నుంచే యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఒకే పేరుతో చాలా మంది ఉండే అవకాశం ఉంది. అందుకే ముందుగానే యూజర్‌నేమ్ రిజర్వేషన్ ప్రారంభించినట్లు వాట్సాప్ వెల్లడించింది. వినియోగదారులు తమకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్ నేమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పేరు ఎంపికలో ఇబ్బంది పడేవారి కోసం ప్రత్యేకంగా యూజర్‌నేమ్ జనరేటర్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.

ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్
ఈ ఫీచర్ పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత, మీరు ముందుగా ఎవరితోనైనా చాట్ ప్రారంభిస్తే వారికి మీ ఫోన్ నంబర్ కనిపించదు. దాని స్థానంలో మీరు ఎంచుకున్న యూజర్‌నేమ్ మాత్రమే కనిపిస్తుంది. దీంతో వ్యక్తిగత నంబర్‌ను అపరిచితులతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే, యూజర్‌నేమ్‌ల కోసం ఎలాంటి పబ్లిక్ సెర్చ్ లేదా డైరెక్టరీ ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఎవరైనా మీకు తొలిసారి మెసేజ్ పంపాలంటే మీ ఖచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసి ఉండాలని సంస్థ తెలిపింది. దీంతో అనవసరంగా అపరిచితులు సంప్రదించే అవకాశాలు తగ్గుతాయి.
‘యూజర్‌నేమ్ కీ’తో అదనపు భద్రత
వాట్సాప్ మరో భద్రతా ఫీచర్‌ను కూడా తీసుకొస్తోంది. గోప్యతను మరింత పెంచేందుకు వాట్సాప్ ‘యూజర్‌నేమ్ కీ’ అనే ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. యూజర్‌నేమ్ కీ పేరుతో నాలుగు అంకెల ప్రత్యేక కోడ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేస్తే, మీకు ఎవరైనా ఫస్ట్ టైం మెసేజ్ పంపాలనుకునే వ్యక్తి మీ యూజర్‌నేమ్‌తో పాటు ప్రత్యేకంగా సెట్ చేసిన ఆ కోడ్‌ను కూడా తెలుసుకుని ఉండాలి. దీంతో స్పామ్ సందేశాలను మరింత సమర్థంగా అడ్డుకోవచ్చు.
యూజర్‌నేమ్ ఎలా రిజర్వ్ చేసుకోవాలి?
ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి రాకముందే వినియోగదారులు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకునే అవకాశం వాట్సాప్ కల్పిస్తోంది. ఇందుకోసం ముందుగా యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసి, సెట్టింగ్స్ → అకౌంట్ → యూజర్‌నేమ్ విభాగంలోకి వెళ్లి కొత్త యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ రాబోయే నెలల్లో దశలవారీగా అన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది. అలాగే కంటెంట్ క్రియేటర్లు, సంస్థలు, వ్యాపారాలు తమ ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఉపయోగిస్తున్న యూజర్‌నేమ్‌ను వాట్సాప్‌లో కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
యూజర్‌నేమ్‌కు ఉండే నిబంధనలు
యూజర్‌నేమ్ కనీసం 3 అక్షరాలు, గరిష్ఠంగా 35 అక్షరాల మధ్య ఉండాలి. ఇంగ్లిష్ అక్షరాలు (a-z), సంఖ్యలు (0-9), అండర్‌స్కోర్ (_), డాట్ (.) మాత్రమే ఉపయోగించాలి. “www”తో ప్రారంభం కావడం లేదా “.com” వంటి వెబ్ డొమైన్‌తో ముగియడం వీలుకాదు. ఇప్పటికే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వినియోగదారుల ప్రైవసీని కాపాడుతున్న వాట్సాప్, ఇప్పుడు యూజర్‌నేమ్ ఫీచర్ ద్వారా వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను కూడా మరింత సురక్షితంగా ఉంచే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది.
