అప్పుడు టీడీపీ కార్యాలయంపై.. ఇప్పుడు ఉండవల్లిలో రైతులపై దాడి..
- కక్షగట్టి దాడి చేస్తున్న తీరు
- గుణదల అభివృద్ధిని పట్టించుకోని నాయకులు
- వాళ్లకు మాట్లాడే హక్కు లేదు
- దాడులకు పాల్పడిన వారికీ చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు
- టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే గుణదల సమస్యల పరిష్కారం..
- మోదీ–చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ అభివృద్ధి
- విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: ఉండవల్లి సెంటర్‌లో ప్రజలపై దాడులకు పాల్పడిన వారే గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన గుండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ (చిన్ని) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, ప్రజలపై దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజయవాడలోని గుణదల రైల్వే లైన్‌పై రూ.98.68 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఫ్లైఓవర్) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుణదల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన నాయకులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గుణదల ప్రాంతంలోని దీర్ఘకాలిక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
రూ.98.68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్ పూర్తయితే గుణదల రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు నగర రవాణా మరింత సులభతరం అవుతుందని తెలిపారు. అభివృద్ధి, శాంతిభద్రతలు, ప్రజాసేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయ హింసకు పాల్పడే వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఎంపీ కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు.
