కేతన్ అగర్వాల్ హత్య కేసు.. కోర్టు కీలక నిర్ణయం

నిందితుల కస్టడీ పొడిగింపు.. లోహగఢ్ ఫోర్ట్ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఫూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి కస్టడీని కోర్టు పొడిగించింది. లోహగఢ్ ఫోర్ట్ వద్ద జరిగిన హత్యకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితులను జూలై 3 వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే లోహగఢ్ ఫోర్ట్ వద్ద క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. హత్య ఎలా జరిగింది, నిందితుల కదలికలు ఎలా ఉన్నాయన్న అంశాలను స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

దర్యాప్తు వివరాల ప్రకారం.. కేతన్ అగర్వాల్‌ను లోహగఢ్ ఫోర్ట్ వద్ద నుంచి తోసివేయడానికి ముందే నిందితులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సియా గోయల్ ఇచ్చిన సంకేతం ఆధారంగానే చేతన్ చౌదరి కేతన్‌ ను కోటపై నుంచి తోసివేసినట్లు విచారణలో వెల్లడైన అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ కేసులో పలు కీలక డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, సందేశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యం, ముందస్తు ప్రణాళికపై మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ కొనసాగుతోంది. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు కస్టడీని పొడిగించారని సమాచారం.