కాజ్వే నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు నుంచి జేఎన్టీయూ మీదుగా అనంతపురం నగరానికి వెళ్లే మార్గంలో పండమేరు వాగుపై నిర్మిస్తున్న లో-లెవెల్ కాజ్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
సోమవారం రాప్తాడు మండల కేంద్రంలో కాజ్వే నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఆమె, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఏప్రిల్ 7న పనులను ప్రారంభించినప్పటికీ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఇకపై పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
పండమేరు వాగుపై సరైన రహదారి లేకపోవడంతో రాప్తాడు మండల ప్రజలతో పాటు హిందూపురం, పెనుకొండ ప్రాంతాల నుంచి జేఎన్టీయూకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కాజ్వే నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి రూ.2 కోట్లు మంజూరయ్యాయని, మిగిలిన రూ.2 కోట్ల నిధులు కూడా త్వరలో మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి మెరుగైన రహదారి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ లక్ష్మీనారాయణ, పీఆర్ ఏఈ కిషోర్ కుమార్, ఏడీసీసీ చైర్మన్ నెట్టెం వెంకటేష్, కన్వీనర్ కొండప్ప తదితరులు పాల్గొన్నారు.
