రైతు భరోసా వర్తింపుపై రైతుల వినతి..

  • రాజ్యసభ సభ్యుడు నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రైతులు

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో తాజాగా జారీ అవుతున్న పట్టాదారు పాస్‌పుస్తకాలకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి ఆధ్వర్యంలో గ్రామ రైతులు హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వేర్వేరుగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా పాస్‌పుస్తకాలు లేకపోవడంతో రైతుబంధు, రైతు భరోసా పథకాల ప్రయోజనాలు అందలేదని తెలిపారు. అలాగే పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోవడం వల్ల రైతు బీమా వర్తించక, పలువురు రైతుల కుటుంబాలకు పరిహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం గ్రామంలో పాస్‌పుస్తకాలు జారీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ నెల 15వ తేదీలోపు పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయంపై ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలిపారు. త్వరలోనే పాస్‌పుస్తకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు జాటోత్ వెంకన్న, గుగులోత్ లచ్చు, వీరాసింగ్, వీరన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.