అంగనవాడి టీచర్లు ఆయాలకు నియామక పత్రాలు అందజేత‌

నందిగామ, ఆంధ్రప్రభ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరు సంవత్సరాల లోపు చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవల్లో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు–2, ఆయా పోస్టులు–21లకు ఎంపికైన అభ్యర్థులకు ఆమె నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, సంరక్షణలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవల కింద పనిచేస్తున్న ఈ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కొత్తగా నియామకమైన టీచర్లు, ఆయాలు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు తోడ్పడాలని సూచించారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు, ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని, తమపై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.