ఓటరు వివరాల నమోదులో తప్పిదాలకు తావివ్వొద్దు: కలెక్టర్

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన వివరాలను బీఎల్‌వోలు యాప్‌లో స్పష్టంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.

సోమవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15, 21 వార్డుల్లో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను తహసీల్దార్ సతీష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 24 వరకు కొనసాగనున్న ఇంటింటి సర్వేను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఓటరు ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించిన వెంటనే బీఎల్‌వో యాప్‌లో నమోదు చేయాలని, ఫారం తిరిగి సేకరించిన అనంతరం వివరాలను యాప్‌లో పొందుపరచాలని తెలిపారు.

మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులు కలిగిన వారి వివరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి వ్యక్తికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా జాబితాను రూపొందించడమే ఈ సవరణ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.