ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇంటింటికీ బీఆర్‌ఎస్ నేతలు..

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

ఓటరు జాబితా సవరణను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నెలరోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమ్‌గల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్ సూచించారు.

మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామం 201వ పోలింగ్ బూత్ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్మిక శాఖ మండల అధ్యక్షుడు డీవీ గంగాధర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంబంధిత బీఎల్‌ఓతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో నమోదు చేసి, బీఎల్‌ఓలకు అందజేయాలని ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా డీవీ గంగాధర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. సరైన వివరాలు నమోదు చేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.