వటసావిత్రి పూజల్లో ప్లకార్డులతో మహిళల నిరసన

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 మరియు తులం బంగారం హామీలను అమలు చేయాలంటూ ఇచ్చోడ మండలంలోని ముఖరా (కే) గ్రామ మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. వటసావిత్రి పౌర్ణమి సందర్భంగా సోమవారం వటవృక్షానికి పూజలు చేసిన మహిళలు.. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని మొక్కుతూ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీల కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500, పెళ్లయిన ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇది మూడవ వటసావిత్రి పౌర్ణమి వస్తున్నా ఇప్పటివరకు ఈ హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మహాలక్ష్మి పథకం నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఇందుబాయి, కూసుమబాయి, శారదా, లక్ష్మి తదితర మహిళలు పాల్గొన్నారు.