Diabetes Eye Disease | నిర్లక్ష్యం చేస్తే శాశ్వత అంధత్వం
Diabetes Eye Disease | నిర్లక్ష్యం చేస్తే శాశ్వత అంధత్వం
Diabetes Eye Disease | డయాబెటిక్ రెటినోపతీ అంటే ఏమిటి?
ప్రారంభ దశలో కనిపించని ప్రమాదకర లక్షణాలు
ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?
నిర్లక్ష్యం చేస్తే అంధత్వం వరకు..!
ఆధునిక చికిత్సలతో చూపును కాపాడుకోవచ్చు
ప్రతి ఏడాది రెటీనా పరీక్ష ఎందుకు తప్పనిసరి?
Diabetes Eye Disease | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: షుగర్ ఉంది.. అయితేనేం, మందులు వాడుతున్నాం అంతే కదా… అని భావిస్తే పొరపాటు పడ్డట్టే. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోతే కేవలం గుండె, కిడ్నీలు మాత్రమే కాదు.. కళ్లు కూడా శాశ్వతంగా దెబ్బతింటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డయాబెటిక్ రెటినోపతీ అనే కంటి వ్యాధి వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఉభయ రాష్ట్రాల్లోని ప్రధాన నేత్ర వైద్యశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో ఎక్కువ మంది మధుమేహం వల్లే కంటి సమస్యలతో సతమతమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు, మరికొన్ని పట్టణాల్లో ఐటీ, ఫార్మా, కార్పొరేట్ ఉద్యోగాల కారణంగా వేలాది మంది రోజుకు 8 నుంచి 12 గంటలు కుర్చీలకే పరిమితమవుతున్నారు. వ్యాయామం లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడి, ఊబకాయం వంటి కారణాలతో మధుమేహం కేసులు పెరుగుతున్నాయి.
వైద్యుల అంచనాల ప్రకారం పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఐదుగురు పెద్దల్లో కనీసం ఒకరు డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
డయాబెటిక్ రెటినోపతీ అంటే?
కంటిలోని రెటీనా అనే భాగం కెమెరాలోని ఫిల్మ్‌లా పనిచేస్తుంది. మనం చూసే ప్రతి దృశ్యం మొదట రెటీనాపై పడుతుంది. ఈ రెటీనాకు రక్తాన్ని సరఫరా చేసే సూక్ష్మ రక్తనాళాలను అధిక చక్కెర స్థాయిలు క్రమంగా దెబ్బతీస్తాయి. మొదట రక్తనాళాల్లో చిన్న ఉబ్బరాలు ఏర్పడతాయి. తర్వాత రక్తస్రావం, ద్రవం లీక్ కావడం, రెటీనాలో వాపు, చివరికి కొత్త బలహీన రక్తనాళాల పెరుగుదల ఉంటుంది. ఈ దశలో చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
అత్యంత ప్రమాదకర విషయం ఏమిటంటే, ఈ వ్యాధి ప్రారంభ దశలో రోగికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. చూపు బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కళ్లలో ఎటువంటి నొప్పి ఉండదు. ఎలాంటి హెచ్చరికలు కూడా ఉండవు. కానీ, లోపల రెటీనాకు నష్టం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే దీనిని వైద్యులు **’సైలెంట్ విజన్ కిల్లర్’**గా అభివర్ణిస్తున్నారు.
ఈ వ్యాధి ముదిరిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయని కంటి వైద్యులు చెబుతున్నారు. చూపు మసకబారడం, పుస్తకం కూడా చదవలేకపోవడం, కళ్ల ముందు నల్లటి చుక్కలు కనిపించడం, రాత్రివేళల్లో చూపు తగ్గడం, ముఖాలు గుర్తుపట్టలేకపోవడం, ఒక్కసారిగా చూపు పోవడం ఈ వ్యాధి లక్షణాలని చెబుతున్నారు.
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే…
పదేళ్లకు పైగా మధుమేహం ఉన్నవారు, హెచ్‌బీఏ1సీ (HbA1c) స్థాయి ఎక్కువగా ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం చేసే వారు, గర్భిణీ మధుమేహ రోగులకు అంధత్వం ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిక్ రెటినోపతీని నిర్లక్ష్యం చేస్తే రెటీనాలో వాపు, రక్తస్రావం, రెటీనా విడిపోవడం, గ్లాకోమా, శాశ్వత అంధత్వం వరకు వెళ్లే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఆప్తాల్మాలజీ నిర్వహించిన ఒక అధ్యయనంలో అనేక దిగ్భాంతికర నిజాలు వెల్లడయ్యాయి. కంటి చూపు బాగుంది కదా అని భావిస్తూ దాదాపు 60 శాతానికి పైగా బాధితులు కంటి పరీక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ పరిశోధన పేర్కొంది. డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యలు ఎలాంటి నొప్పి లేదా చూపులో మార్పులు లేకుండానే ఏళ్ల తరబడి లోపల పెరిగిపోతుండటమే అసలు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా మధుమేహ బాధితులు బ్లడ్ షుగర్ స్థాయిలను తరచూ పరీక్షించుకుంటారు. కానీ కంటి పరీక్షల జోలికి వెళ్లరు. రక్తంలో చక్కెర స్థాయి దీర్ఘకాలం పాటు నియంత్రణలో లేనప్పుడు కంటిలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. మనం స్పష్టంగా చూడటానికి కారణమైన రెటీనా సక్రమంగా పనిచేయాలంటే ఈ రక్తనాళాలే ఆధారం. షుగర్ తీవ్రత వల్ల ఈ నాళాలు బలహీనపడి లీక్ అవడం, వాపు రావడం లేదా రక్తం కారడం జరుగుతుంది. వైద్య పరిభాషలో దీనినే డయాబెటిక్ రెటినోపతీ అంటారు.
ప్రారంభ దశలో దీనివల్ల ఎలాంటి స్పష్టమైన హెచ్చరికలు ఉండవు. లోపల నష్టం జరుగుతున్నా కూడా బాధితుడు ఎప్పటిలాగే చదవడం, డ్రైవింగ్ చేయడం వంటి పనులు చేసుకోగలడు. కానీ ఒకసారి రెటీనా తీవ్రంగా దెబ్బతింటే పూర్తి చూపును తిరిగి తీసుకురావడం చాలా కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందుబాటులో ఆధునిక చికిత్సలు
గతంలో ఈ వ్యాధి అంటే చూపు కోల్పోవడమే అనే భయం ఉండేది. కానీ ప్రస్తుతం ఆధునిక వైద్యం వల్ల పరిస్థితి మారింది. అందుబాటులో ఉన్న లేజర్ ఫోటోకోయగ్యులేషన్, యాంటీ-వీఈజీఎఫ్ (Anti-VEGF) ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, విట్రెక్టమీ శస్త్రచికిత్సలను సమయానికి తీసుకుంటే చాలా మంది రోగుల్లో చూపును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆస్పత్రులకు వచ్చే అనేక మంది రోగులు 50 శాతానికి పైగా చూపు కోల్పోయిన తర్వాతే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కంటి పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య సేవల్లో భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో రెటీనా స్క్రీనింగ్, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఐ స్క్రీనింగ్ యూనిట్ల ఏర్పాటు, మధుమేహ రోగులకు వార్షిక కంటి పరీక్షలు తప్పనిసరి చేయడం, మధుమేహంతో వచ్చే నేత్ర సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యవసరమని వైద్యులు చెబుతున్నారు.
పెరుగుతున్న డయాబెటిస్ భారంతో పాటు ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతీ కూడా ఒక నిశ్శబ్ద ప్రజారోగ్య సంక్షోభంగా మారుతోంది. అందుకే వైద్యులు షుగర్‌ను నియంత్రించడం మాత్రమే కాదు.. ప్రతి ఏడాది ఒకసారి రెటీనా పరీక్ష చేయించుకోవడం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు.
