INDvsIRE-T20 | ప్రపంచ ఛాంపియన్లకు ఐర్లాండ్ షాక్!
- బెల్‌ఫాస్ట్‌లో భారత్‌కు బిగ్ బ్లో..
- భారత్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన ఐర్లాండ్..
- చరిత్ర సృష్టించిన టక్కర్ సేన
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రపంచ టీ20 ఛాంపియన్ భారత జట్టుకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలిచిన ఐర్లాండ్.. రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఈ ఓటమితో భారత్ 1,050 రోజులుగా కొనసాగుతున్న టీ20 ద్వైపాక్షిక సిరీస్ విజయాల పరంపరకు తెరపడింది. భారత జట్టు చివరిసారిగా 2023 ఆగస్టులో వెస్టిండీస్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అప్పటి నుంచి వరుసగా అన్ని ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఓటమిని చవిచూసింది.
ఈ మధ్యకాలంలో భారత్ వరుసగా 16 టీ20 సిరీస్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నా.. ఆ విజయపరంపరకు ఐర్లాండ్ బ్రేక్ వేసింది. ఇక ఈ సిరీస్ విజయంతో ఐర్లాండ్ మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకుంది. భారత్‌పై అన్నీ ఫార్మాట్‌లో ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విషేశం. బెల్‌ఫాస్ట్ పరిస్థితులను చక్కగా వినియోగించుకున్న ఐర్లాండ్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్లను పూర్తిగా అధిగమించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మరోసారి ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ రాస్ అడైర్ తొలి ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే భారత బౌలర్లు వెంటనే పుంజుకుని 7.3 ఓవర్లలోనే ఐర్లాండ్‌ను 48/3తో కష్టాల్లోకి నెట్టారు. ఈ దశలో హ్యారీ టెక్టర్, బెన్ కాలిట్జ్ నాలుగో వికెట్‌కు 65 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. తన 100వ టీ20 మ్యాచ్ ఆడిన హ్యారీ టెక్టర్ అర్ధశతకంతో రాణించడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 154/8 పరుగులు చేసింది.
భారత్ తరఫున అరంగేట్ర ఆటగాడు ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే 3 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు.
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జై మూంద్ర తొలి బంతికే సంజూ శాంసన్‌ను ఎల్‌బీగా ఔట్ చేశాడు. అదే ఓవర్లో అభిషేక్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా, రెండో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఇషాన్ కిషన్, తిలక్ వర్మల మధ్య జరిగిన ఘోర అపార్థంతో ఇషాన్ రనౌట్ కావడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది.
ఈ పరిస్థితుల్లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. 46 బంతుల్లో 55 పరుగులు చేసి చివరి వరకు జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. శివమ్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పినా.. మరోవైపు వికెట్లు క్రమం తప్పకుండా పడుతుండటంతో భారత్ లక్ష్యానికి చేరుకోలేకపోయింది. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదినా భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులకే పరిమితమైంది. దీంతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ ఒక పరుగు తేడాతో ఓటమిపాలై, సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది.
