తొర్రూరులో డ్రగ్స్ కలకలం..?
- ఆర్టీసీ బస్టాండ్ మరుగుదొడ్లలో ఇంజెక్షన్ కలకలం
- పోలీసుల నిఘాపై స్థానికుల ప్రశ్నలు..
- ముమ్మర తనిఖీలు చేపట్టాలని డిమాండ్
తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణంలో మత్తు పదార్థాల వినియోగంపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌లోని మరుగుదొడ్లలో వాడి పడేసిన ఇంజెక్షన్ కనిపించడం స్థానికుల్లో ఆందోళనకు దారితీసింది. అయితే ఆ ఇంజెక్షన్ సాధారణ వైద్య వినియోగానికి సంబంధించినదా? లేక మత్తు పదార్థాల వినియోగంలో భాగమా? అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
జిల్లా పోలీసులు గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించి ప్రజల సహకారం కోరుతున్న నేపథ్యంలో, బహిరంగ ప్రదేశంలో ఇలాంటి ఇంజెక్షన్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఈ ఘటనతో భద్రతా చర్యలపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలంటే డ్రగ్స్ సరఫరా గొలుసుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ప్రస్తుతం లభించిన సమాచారం ప్రకారం, ఆర్టీసీ బస్టాండ్‌లో లభించిన ఇంజెక్షన్ డ్రగ్స్ వినియోగానికి సంబంధించినదని అధికారికంగా పోలీసులు లేదా వైద్యాధికారులు నిర్ధారించలేదు. దర్యాప్తు అనంతరం మాత్రమే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
