జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి..
- ముమ్మరంగా సీసీ రోడ్డు పనులు
- మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జర్నలిస్టు కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని పిల్లికోటల్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ఇటీవల ప్రారంభించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జర్నలిస్టులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల కాలనీలో అవసరమైన సదుపాయాలను మున్సిపాలిటీ తరఫున ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, నాణ్యతతో కూడిన పనులు త్వరితగతిన పూర్తి కానున్నట్లు తెలిపారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జర్నలిస్టులు శంకర్ దయాల్ చారి, కామాటి కృష్ణ, సంగమేశ్వర్, ఉషయ్య, ఆంజనేయులు, ఫణి, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
