ఆధునిక టెక్నాలజీతో విద్యార్థుకు పాఠాలు బోధన..
సిరికొండ, ఆంధ్రప్రభ : ఆధునిక సాంకేతికతను విద్యాబోధనలో వినియోగిస్తే విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తి, అవగాహన మరింత పెరుగుతుందని సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ తెలిపారు.
ఆదివారం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ, ఇటీవల ఓ దాత పాఠశాలకు డిజిటల్ ప్రొజెక్టర్‌ను బహుమతిగా అందించారని చెప్పారు. ఆ ప్రొజెక్టర్‌ను వినియోగిస్తూ 5వ తరగతి విద్యార్థులకు ‘పౌర కుటుంబం’ పాఠాన్ని డిజిటల్ విధానంలో బోధించినట్లు తెలిపారు. చిత్రాలు, వీడియోల ద్వారా పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వింటున్నారని, విషయాలను సులభంగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపిన తల్లిదండ్రులు, ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్న విషయాన్ని తెలుసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తోందని తల్లిదండ్రులకు వివరించామని తెలిపారు.
ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం తమకు మరింత ఉత్సాహాన్నిచ్చిందన్నారు. తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు డిజిటల్ బోధనతో పాటు వివిధ వినూత్న బోధనా విధానాలను అమలు చేస్తూ, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు నరేష్ తెలిపారు.
