తన ఉచ్చులో తానే చిక్కుకున్న ప్రేమికుడు..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రేమ విఫలమైతే కొందరు జీవితాన్ని మళ్లీ ప్రారంభిస్తారు.. మరికొందరు ప్రతీకారంతో రగిలిపోతారు. కానీ కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ యువకుడు మాత్రం దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తనను కాదని దూరంగా ఉంటున్న మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసి.. ఆమెతో పాటు తానూ చనిపోవాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం కారులో బాంబు సెట్ చేసి పేల్చేందుకు సిద్ధమయ్యాడు. కానీ విధి మరోలా నిర్ణయించింది. పేలుడు జరగడానికి క్షణాల ముందు యువతి కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకోగా.. బాంబు పేలడంతో యువకుడు కారులోనే సజీవదహనమయ్యాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన నాగేంద్ర (30), జయనగర్‌లో నివసించే ఒక యువతి గతంలో ప్రేమించుకున్నారు. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ కొద్ది రోజుల క్రితం విడిపోయారు. ఆ యువతి నాగేంద్ర నెంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో కక్ష పెంచుకున్న నాగేంద్ర, శనివారం ఉదయం బెంగళూరులోని ఆమె రెంటుకు ఉంటుంన్న రూమ్‌కు వెళ్లి గొడవపడ్డాడు. ఆ తర్వాత ఒక ఊబెర్ క్యాబ్‌ను బుక్ చేసి, ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశాడు. యువతి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బెంగళూరు జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

కారులోబాంబు చూపించి బెదిరింపులు..

కారు బెంగళూరు నుంచి అంకోలా వైపు వెళ్తుండగా, నాగేంద్ర తన వద్ద ఉన్న ఒక పేలుడు పదార్థాన్నియువతికి చూపించి.. “నిన్ను చంపి, నేను చచ్చిపోతాను” అంటూ బెదిరింపులకు దిగాడు. కారు నేషనల్ హైవే-48 (NH-48) పై తుమకూరు జిల్లా సిరా తాలూకాలోని జోగిహళ్లి సమీపానికి చేరుకోగానే, నాగేంద్ర కారులోనే ఆ యువతిపై కత్తితో దాడి చేశాడు. కారులో గొడవ జరుగుతుండటాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపాడు. ఆ తరుణంలో యువతి చాకచక్యంగా డోర్ లాక్ తెరిచి కారులో నుంచి బయటకు దూకేసింది.

యువతి బయటకు దూకిన కొన్ని సెకన్లలోనే కారులో బాంబు పేలుడు సంభవించింది. క్షణాల్లో కారు మొత్తం భారీగా మంటలు వ్యాపించాయి. కారు లోపలే చిక్కుకుపోయిన నాగేంద్ర అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనలో కారు నుంచి దూకేసిన యువతితో పాటు క్యాబ్ డ్రైవర్ కు గాయాలయ్యాయి.

నాగేంద్ర పక్కా ప్లాన్‌తో తనతో పాటు పేలుడు పదార్థాలను కారులోకి తెచ్చుకున్నాడని, అతనే కావాలని ఆ బాంబును పేల్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తుమకూరు ఎస్పీ అశోక్ కె.వి తెలిపారు. కారులో పేలకుండా ఉన్న మరికొన్ని బాంబు తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను ఆ పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తెచ్చాడు. దాన్ని ఎలా తయారు చేశాడు అనే కోణంలో కల్లంబెల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.