రాత్రంతా నిద్రపోవట్లేదా? అసలు కారణమిదే..!
- ‘రివెంజ్ బెడ్‌టైమ్ ప్రోక్రాస్టినేషన్’ అంటే ఏంటి?
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాత్రి పూర్తిగా నిద్రే లేదు… వేళ దాటినా ఆకలి కాదు… ఏమి తోచదు… ఏదీ నచ్చదు… పిచ్చి పట్టినట్టుందే… ఈ పాట గుర్తుందా? ప్రేమలోని విరహ వేదనను అద్భుతంగా ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ సాంగ్… అప్పట్లో ప్రేమికుల మనసును తాకింది. కానీ నేటి డిజిటల్ యుగంలో మాత్రం ఈ పాటలోని భావాలు మరో రూపంలో చాలా మంది జీవితాలకు అద్దం పడుతున్నాయి.
రాత్రి 1 గంట… 2 గంటలు… 3 గంటలు… కొన్నిసార్లు తెల్లవారుజామున 5 లేదా 6 గంటల వరకు మేల్కొని ఉండేవాళ్లు నేటి యువతలో, ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో చాలామందే ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వారికి నిద్ర రాక కాదు.. నిద్ర వచ్చినా కావాలనే మొబైల్లో వీడియోలు చూస్తూ, సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ, వెబ్‌సిరీస్‌లు చూస్తూ నిద్రను వాయిదా వేస్తుంటారు. ఈ ప్రవర్తనను సైకాలజీలో ‘రివెంజ్ బెడ్‌టైమ్ ప్రోక్రాస్టినేషన్’ (Revenge Bedtime Procrastination) అని పిలుస్తారు.
ఎందుకు ఇలా చేస్తారు..?
రోజంతా ఉద్యోగం, చదువు, కుటుంబ బాధ్యతలు, ప్రయాణాలు.. ఇలా జీవితమంతా పనుల్లోనే గడిచిపోతుంది. “నాకోసం నేను ఒక్క నిమిషం కూడా కేటాయించుకోలేకపోయాను” అనే భావన మనసులో పెరుగుతుంది. దానికి ప్రతీకారంగానే.. “ఈ రాత్రి సమయం నాదే.. ఇప్పుడైనా నాకు నచ్చింది చేస్తాను” అని మెదడు నిర్ణయిస్తుంది. ఫలితంగా మరుసటి రోజు ఉదయం లేవాల్సి ఉందని తెలిసినా.. ఆఫీస్, కాలేజీకి వెళ్లాలని తెలిసినా.. నిద్రను కావాలనే వాయిదా వేస్తారు.
ఇది నిద్రలేమి కాదు..!
సైకాలజిస్టుల ప్రకారం ఇది ఇన్సోమ్నియా (నిద్రలేమి వ్యాధి) కాదు. సమయ నిర్వహణలో లోపం, మానసిక ఒత్తిడి, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల ఏర్పడే ఒక మానసిక ప్రవర్తన. ముఖ్యంగా రోజంతా బిజీగా ఉండేవారు, ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉండేవారు, తమకు ఇష్టమైన పనులకు సమయం దొరకని వారిలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలంలో ఎలాంటి ప్రమాదాలు..?
ఈ అలవాటు ఎక్కువ కాలం కొనసాగితే శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిద్రలేమి, ఉదయం లేవగానే అలసట, ఏకాగ్రత తగ్గిపోవడం, చిరాకు, ఆందోళన, జ్ఞాపకశక్తి బలహీనపడటం, పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ అలవాటు నుంచి బయటపడాలంటే..?
రోజులో కొంత సమయాన్ని మనకు ఇష్టమైన పనులకు కేటాయించాలి. రాత్రి నిద్రకు గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీలకు దూరంగా ఉండాలని నిపుణుల సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో మేల్కొనే అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు పుస్తకం చదవడం, మెడిటేషన్ లేదా ప్రశాంతమైన మ్యూజిక్ వినడం వంటి అలవాట్లు మంచి నిద్రకు సహాయపడతాయి. నిద్రను త్యాగం చేసి మన కోసం సమయం సంపాదిస్తున్నామని అనిపించినా.. వాస్తవానికి మన ఆరోగ్యాన్నే కోల్పోతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
