అధికారంలో అణిచివేతపై తిరుగుబాటు చేద్దాం..

  • రాజకీయంలో మాదిగల న్యాయమైన వాటా కోసం పోరాటం
  • మాదిగ మహా శక్తి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు అసంపల్లి శ్రీనివాస్
  • మాదిగ ప్రజాప్రతినిధులకు సత్కారం

గోదావరిఖని, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో కవచంగా మాత్రమే వాడుకుంటున్నారని… రాజకీయ అధికారంలో మాత్రం మాదిగలపై జరుగుతున్న అణిచివేతపై తిరుగుబాటు చేద్దామని మాదిగ మహా శక్తి కోరు కమిటీ సభ్యుడు అసంపల్లి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంపీటీసీ శ్రీమయి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో మాదిగ మహాశక్తి బ్రాహ్మణ నియోజకవర్గ మాదిగల ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాదిగ మహాశక్తి కోర్ కమిటీ సభ్యుడు ఆసంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మాదిగల ఓట్లు మాదిగలకే వేసుకోవాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ఏ రాజకీయ పార్టీ అయినా న్యాయంగా జనాభా దామాషా ప్రకారం మాదిగలకు సముచిత స్థానం కల్పించకపోతే ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకపై మాదిగ జాతి కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించని పార్టీలను భవిష్యత్తులో బొంద పెడదామని కరాకండిగా చెప్పారు. రాజకీయ అధికారంలో మాదిగలకు న్యాయం జరిగేందుకే మాదిగ మహాశక్తి పురుడు పోసుకుందని స్పష్టం చేశారు. రాజకీయ అధికారంలో న్యాయమైన వాటాను డిమాండ్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలలో అధిక భాగంలో మాదిగ ప్రతినిధులు పోటీ చేసేందుకు అవకాశం కల్పించేందుకు ఐక్యతతో ముందుకు సాగుదాం అన్నారు.

షెడ్యూల్డ్ కుల జనాభాలో మాదిగ సమాజం ఒక ముఖ్యమైన భాగంగా ఉందనీ … రాజకీయంగా ఉన్నత పదవులను పొందే విషయంలో మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ మహా శక్తి ద్వారా ఉద్యమ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తామని అసంపల్లి శ్రీనివాస్ నొక్కి చెప్పారు. మాదిగ మహాశక్తి ప్రతినిధి మడిపల్లి మల్లేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు ఇంజపూరి పులిందర్, కార్పోరేటర్ కర్రావుల డేవిడ్ రాజ్ ,పెద్దెళ్లి ప్రకాష్, బూడిద మహేందర్, జూల లింగయ్య, గంగ ప్రసాద్, విజయ్ కుమార్, పర్లపల్లి బాబు, పుట్ట సదానందం, రాజ్ గోపాల్, భాగ్యలక్ష్మి తోపాటు సుమారుగా 200 మంది మాదిగ మహాశక్తి ప్రతినిధులు పాల్గొన్నారు.