ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే..
ప్రభుత్వానికి ఏపీజేఏసీ హెచ్చరిక
12వ పీఆర్సీ, డీఏ బకాయిలు, ఈహెచ్ఎస్, సీపీఎస్‌పై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్
ఏలూరు, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించలేదని ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల హక్కుల సాధన కోసం డివిజన్, జిల్లా స్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి, అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతామని ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం ఏలూరులో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించి, ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను వెల్లడించారు.
సమావేశంలో 2023 జూలైలో ఏర్పాటు కావాల్సిన 12వ పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం ఇప్పటికీ నియమించలేదని విమర్శించారు. వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఉద్యోగులకు కనీసం 30 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ.33 వేల కోట్ల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను 90 రోజుల్లో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి 300 రోజులు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో ఏడాదిలోగా సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే గతంలో మాదిరిగానే సుదీర్ఘ ఉద్యమానికి సిద్ధమవుతామని ఏపీజేఏసీ అమరావతి నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-చైర్మన్ కె. శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రటరీ బి. రాంబాబు, మహిళా విభాగం చైర్పర్సన్ గీతిక, వైస్ చైర్మన్లు బి. సత్యనారాయణ, నాగేశ్వరరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎం. మహాలక్ష్మి, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ. శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు కమల్, ప్రభాకరరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
