Government-Teacher-Suicide : ఆ టీచరమ్మ ఇక లేరు Andhra Prabha Sad News

Government-Teacher-Suicide : ఆ టీచరమ్మ ఇక లేరు Andhra Prabha Sad News

  • వెన్ను నొప్పి భరించలేక ఆత్మహత్య
  • పలాస మారుతీ నగర్ లో విషాదం
  • మూడు రోజుల తర్వాత వెలుగులోకి ఘటన..

(ఆంధ్రప్రభ, పలాస )

Government-Teacher-Suicide : శ్రీకాకుళం జిల్లా పలాసలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న జన్ని రోహిణి (39) తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆమె మృతి చెందిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.


పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం… రోహిణి చాలా కాలంగా తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నొప్పిని తట్టుకోలేక మానసికంగా తీవ్ర వేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.మారుతీనగర్‌లోని నివాసంలో ఘటన జరిగినట్లు సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
మృతురాలి భర్త జీవన్ విజయనగరం జీఎస్టీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగరీత్యా విజయనగరంలో ఉంటూ ప్రతి శనివారం పలాసలోని ఇంటికి వచ్చేవారని, ఈసారి ఇంటికి చేరుకున్న సమయంలో రోహిణి మృతి చెందిన విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు.రోహిణికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కావ్య బీఎస్సీ ఫిజియోథెరపీ చదువుతుండగా, రెండో కుమార్తె భవ్య ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తోంది. కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసిన ఈ ఘటన పలాసలో అందరినీ కలచివేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.