Sing Geetham | “సీంగ్ గీతమ్”తో ప్రేక్షకుల మనసు గెలిచిన శ్రీ ముక్త..
Sing Geetham | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఇటీవల విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న “సీంగ్ గీతమ్” సినిమాలో తన సహజ నటనతో ఆకట్టుకున్న నటి శ్రీ ముక్త ప్రత్యేకంగా ఆంధ్రప్రభతో మాట్లాడారు. సినిమా అవకాశం ఎలా వచ్చిందో, గర్భిణి పాత్రను పోషించే సమయంలో ఎదురైన అనుభవాలు, ప్రేక్షకుల స్పందన గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాను “ఛాంపియన్” సెట్స్ లో ఉండగా “సీంగ్ గీతమ్” అవకాశం వచ్చిందని… చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గీతా, ఏటీ శ్రీనివాస్ స్వయంగా వచ్చి తనకు, తన తండ్రికి కథ వివరించారని చెప్పారు. మొదట మరో పాత్ర గురించి చర్చించినప్పటికీ, తర్వాత మార్పులు చేసి ప్రస్తుతం చేసిన పాత్రను తనకు అప్పగించారని తెలిపారు.
సినిమాలో గర్భిణి మహిళ పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిసినప్పుడు తొలుత కొంత భయపడ్డారని… ఆ పాత్రలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో ప్రేక్షకులను సహజంగా ఆకట్టుకోగలనో లేదో అన్న సందేహం కలిగిందన్నారు. అయితే దర్శకుడు, చిత్రబృందం ఇచ్చిన ప్రోత్సాహం, సహకారంతో పాత్రలో పూర్తిగా లీనమై నటించగలిగానని తెలిపారు.
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె చెప్పారు. గర్భిణి పాత్రలో తన నటన చాలా సహజంగా ఉందంటూ పలువురు అభినందించడం, ఫోన్‌లు చేయడం, సోషల్ మీడియాలో సందేశాలు పంపడం నటిగా తనకు గొప్ప సంతృప్తిని ఇచ్చిందన్నారు.
“సీంగ్ గీతమ్” విజయం తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్న శ్రీ ముక్త, భవిష్యత్తులో కూడా ప్రేక్షకులను అలరించే మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. చివరగా చిత్రబృందానికి, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పూర్తి వీడియోను వీక్షీంచడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
