Tirumala28june26 | తిరుమల భక్తులకు అలర్ట్
Tirumala28june26 | తిరుమల భక్తులకు అలర్ట్
సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
● అధిక సంఖ్యలో సాధారణ భక్తులకు దర్శనం కల్పించేందుకే టీటీడీ నిర్ణయం
● సిఫార్సు లేఖలు, శ్రీవాణి కరెంట్ బుకింగ్ దర్శన టికెట్లను నిలిపివేసిన దేవస్థానం
Tirumala28june26 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. అధిక సంఖ్యలో సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే ఆదివారం వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. సోమవారం శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ బుకింగ్ దర్శన టికెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. సాధారణ భక్తులకు ఎక్కువ అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయాల ఉద్దేశమని తెలిపింది. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు బాలాజీ నగర్ వరకు చేరుకున్నాయి. రాబోయే రెండు రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెరిగిన రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సీనియర్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తిరుమలకు బయలుదేరే ముందు ప్రస్తుత రద్దీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికను పునఃసమీక్షించుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
