గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలి..

గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలి..

  • క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలి..
  • కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలమ్

కరీంనగర్, (ఆంధ్రప్రభ): గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలమ్ పేర్కొన్నారు. శనివారం పోలీస్ శాఖలో పరిపాలనా దక్షత, పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీపీ వార్షిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, ప్రజల ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియల సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల్లో భాగంగా కార్యాలయ ప్రాంగణంలోని అంతర్గత, బాహ్య పరిసరాల పరిశుభ్రతను సీపీ నిశితంగా పరిశీలించారు. తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలోని స్టేషన్ రికార్డులు, పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు, వాటి దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోకి వచ్చే మూడు పోలీస్ స్టేషన్లయిన తిమ్మాపూర్, ఎల్ఎండీ కాలనీ, చిగురుమామిడిల పనితీరుపై సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించిన సీపీ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం సర్కిల్ పరిధిలోని అన్ని రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందని, కేసుల దర్యాప్తు పురొ గతి సంతృప్తికరంగా ఉందన్నారు.

సుమారు నెల రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించిన కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, అప్పుడే సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటుండటాన్ని అభినందించారు. మరింత సమర్థవంతమైన, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ వ్యవస్థను అందించె ందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ, గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు సీపీ జారీచేశారు. మొత్తంగా తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయ పనితీరు మరియు సన్నద్ధత ప్రశంసనీయంగా ఉందని సీపీ సంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానిక అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు అన్వర్, గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.