రైతు భరోసా పథకానికి దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌

  • అర్హులైన రైతులు జులై 5లోగా ద‌ర‌ఖాస్తులు ఇవ్వాలి
  • కొత్తగా పాస్‌బుక్ పొందిన రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలి
  • జిల్లా వ్యవసాయాధికారి శివ‌ప్రసాద్‌

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ శ‌నివారం ఒక ప్రకటన లో తెలిపారు. 2026 జూన్ 15 వరకు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. అర్హత ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జూలై 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హులైన రైతులు తమకు సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) లేదా మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో) కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ (మొదటి పేజీ) జిరాక్స్ కాపీలను, రైతు భరోసా దరఖాస్తు ప‌త్రానికి జ‌త చేసి సమర్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన రైతులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని ఆయన కోరారు.