రూ.3 కోట్ల అటవీ భూమి స్వాధీనం..

గ్రామస్తులు 30 ఏళ్లుగా ఆక్రమించుకున్న అటవీ భూమి..
అటవీ ఉన్నతాధికార్ల ఆదేశాలతో..
చాకచక్యంగా వ్యవహరించిన ఎఫ్డీఓ రేంజ్ ఆఫీసర్..

జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం అటవీ డివిజన్ పరిధిలో సుమారు రూ.3 కోట్ల విలువైన 9 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమిని అటవీశాఖ అధికారులు శనివారం తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 30 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న ఈ భూమిలో కొందరు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఇందనపల్లి రేంజ్, కలమడుగు ఫారెస్ట్ బీట్‌లో మురిమడుగు గ్రామ సమీపంలో ఉన్న ఈ భూమిని అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక ఎఫ్‌డీఓ ఎం. రామ్మోహన్, ఇందనపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. వికాస్‌తో పాటు జన్నారం, ఇందనపల్లి, తాళ్లపేట రేంజ్‌లకు చెందిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, బీట్ ఆఫీసర్లు సంయుక్తంగా చర్యలు చేపట్టారు.


ఆక్రమిత భూమిని జేసీబీ సహాయంతో చదును చేసి, మళ్లీ ఆక్రమణలు జరగకుండా చుట్టూ కందకం తవ్వించారు. ఈ సందర్భంగా ఇందనపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 30 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న 9 ఎకరాల అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ భూమి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని చెప్పారు. విలువైన అటవీ భూములను ఆక్రమించిన వారి నుంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అటవీ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.