పల్స్ పోలియో విజయవంతానికి అవగాహన ర్యాలీలు
‘నిండు జీవితానికి రెండే చుక్కలు’.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారుల పిలుపు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉరవకొండ ఎంపీడీఓ రవి ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు.
శనివారం మండలంలోని పెద్దముష్టూరు, మోపిడి, ఆమిద్యాల, వ్యాసాపురం గ్రామాల్లో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి అధికారి ఆశీర్బాబు, పెన్నాహోబిలం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టవర్ క్లాక్ వరకు మరో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినీత, డాక్టర్ సాహితి, సీహెచ్‌వోలు, పట్టణ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పట్టణంలో ఐదేళ్లలోపు 4,340 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ‘నిండు జీవితానికి రెండే చుక్కలు’ అనే నినాదంతో ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు.
ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు పోలియో బూత్‌లలో, రెండో, మూడో రోజుల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని వెల్లడించారు.
పట్టణంలో 20 పోలియో బూత్‌లు, ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక ట్రాన్సిట్ పాయింట్, ఒక మొబైల్ టీమ్‌తో పాటు మొత్తం 88 మంది సిబ్బందిని ఈ కార్యక్రమం కోసం నియమించినట్లు అధికారులు తెలిపారు.
