లాకప్ డెత్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి…
గాంధీనగర్ ధర్నాచౌక్లో వైఎస్సార్సీపీ నిరసన.. హోంమంత్రి రాజీనామాకు డిమాండ్..
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో పెద్దఎత్తున ఆందోళన
సీసీటీవీ ఫుటేజీల తొలగింపు, సాక్ష్యాల తారుమారు చేసారు..
సిట్, శాఖాపరమైన విచారణలపై నమ్మకం లేదన్న వైఎస్సార్సీపీ
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం
విజయవాడ, ఆంధ్రప్రభ : గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ ధర్నాచౌక్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, విజయవాడ నగరంలో పట్టపగలే పోలీస్ స్టేషన్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న లాకప్ డెత్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందన్నారు.
పోలీస్ స్టేషన్లో వ్యక్తిని కొట్టి చంపి, కనీస పంచనామా నిర్వహించకుండా శవాన్ని బస్టాండ్లో అనాథ మృతదేహంగా చిత్రీకరించి రహస్యంగా దహనం చేశారని ఆరోపించారు. బాధితుడి తల్లి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లగా, దండ వేసుకో… నీ కొడుకు చనిపోయాడు అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు. కేసును పక్కదారి పట్టించే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్, హోటల్, ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను తొలగించారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 18 నెలల పాటు భద్రపరచాల్సిన ఫుటేజీలను ఎవరి అనుమతితో తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సిట్ విచారణతో న్యాయం జరగదని, తప్పుడు రిమాండ్ రిపోర్టుల ద్వారా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తప్పు చేసిన అధికారులపైనే మళ్లీ పోలీసు అధికారులతో విచారణ చేయించడం వల్ల నిజాలు వెలుగులోకి రావనే నమ్మకం తమకు లేదన్నారు. వరుస బదిలీలతో కేసును బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని, ప్రాథమిక దశలోనే సాక్ష్యాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా అక్రమ కేసులు, అరెస్టులతో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆరోపించిన మల్లాది విష్ణు, ఈ ఘటనపై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు హోంమంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయాల కోసం చేసే పోరాటం కాదని, బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
