ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి..

  • డీఎంహెచ్‌వో డాక్టర్ జయచంద్ర మోహన్

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ జయచంద్ర మోహన్ పిలుపునిచ్చారు.

శనివారం ఊట్కూర్ మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంపై వివిధ పాఠశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు.

ఆదివారం పోలియో కేంద్రాలకు రాలేని చిన్నారుల కోసం జూన్ 29, 30 తేదీల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేస్తారని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అత్యంత అవసరమని, గతంలో చుక్కలు వేయించినప్పటికీ ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమంలో మరోసారి తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

పోలియో వైరస్‌ నుంచి పిల్లలకు సంపూర్ణ రక్షణ కల్పించడంలో ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్న ఆయన, జిల్లాలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులను తీసుకువచ్చి చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులను కోరారు.

పోలియో నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోషి, జిల్లా అధికారి విజయకుమార్, హెల్త్ సూపర్వైజర్ మణిమాల, ఏఎన్‌ఎంలు గోవిందమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.