అచ్చంపేటలో ప్రైవేట్ స్కూల్ దందాపై వేటు

స్కూల్‌లోనే పుస్తకాల విక్రయం
సీజ్ చేసిన మండల విద్యాధికారి
యాజమాన్యానికి నోటీసులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాల విక్రయం జరుపుతున్న ప్రైవేట్ విద్యాసంస్థపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అచ్చంపేటలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పుస్తకాలు అమ్ముతున్న విషయాన్ని విద్యార్థి సంఘాల నాయకులు గుర్తించి మండల విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు వెంటనే స్పందించారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగ అనిల్ కుమార్, ఎం ఎస్ ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుక్కాపురం మహేష్ మాదిగ, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు సయ్యద్, ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయగా, మండల విద్యాధికారి శ్రీనివాసమూర్తి స్కూల్‌ను పరిశీలించారు.

తనిఖీల్లో పాఠశాల పరిధిలోనే పాఠ్యపుస్తకాల విక్రయం జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో పుస్తకాలు నిల్వ ఉంచిన గదిని అధికారులు సీజ్ చేశారు. అలాగే స్కూల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, “ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలల్లో పుస్తకాల విక్రయం అనుమతించబడదు. శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో అలాంటి ఉల్లంఘనలు గుర్తించినందున గదిని సీజ్ చేసి, యాజమాన్యానికి నోటీసులు అందజేశాం. తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం” అని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకునే విధంగా ప్రైవేట్ స్కూల్స్ వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను సహించబోమని వారు స్పష్టం చేశారు.