Pulse Polio TG | పోలియో చుక్కలు వేయిద్దాం రండి..
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కలు
40.97 లక్షల మంది చిన్నారులకు టీకాల లక్ష్యం..
ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
Pulse Polio TG | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఆదివారం (జూన్ 28) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించాలని అధికారులు సూచించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), అంగన్వాడీ కేంద్రాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నారు.
ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో సాధారణ టీకాలు తీసుకున్న పిల్లలకు కూడా రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాల్సి ఉంటుంది. బూత్ రోజున టీకా వేయించుకోలేని చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో జనాభా అధికంగా ఉండటంతో జూలై 1న కూడా ప్రత్యేక డ్రైవ్ కొనసాగించనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 40,97,749 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 22,979 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణాల్లో ఉండే చిన్నారుల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 903 ట్రాన్సిట్ పాయింట్లు, మారుమూల ప్రాంతాల కోసం 903 మొబైల్ బృందాలను సిద్ధం చేశారు. కార్యక్రమంలో 8,754 మంది ఏఎన్ఎంలు, 28,160 మంది ఆశా కార్యకర్తలు, 35,700 మంది అంగన్వాడీ టీచర్లు సేవలందించనుండగా, వీరి పనితీరును పర్యవేక్షించేందుకు 2,298 మంది రూట్ సూపర్వైజర్లను నియమించారు. వ్యాక్సిన్ కొరత తలెత్తకుండా 52,04,140 బీఓపీవీ (బైవేలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్) డోసులను ఇప్పటికే జిల్లాలకు పంపిణీ చేశారు.
ఒక్క చిన్నారి కూడా మిస్ కావొద్దు : మంత్రి దామోదర
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా పోలియో బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా వ్యాక్సిన్ అందించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్ 28న బూత్‌లలో, జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలై 1న అదనంగా మరో రోజు కార్యక్రమాన్ని కొనసాగించాలని మంత్రి సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, గతంలో టీకాలు వేయించుకున్నప్పటికీ ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలని వైద్యారోగ్య శాఖ తల్లిదండ్రులను కోరింది. పోలియో నిర్మూలనలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
