Baswapur | బస్వాపూర్ శివారులో సంచారం

గొర్రెల మందపై దాడి చేసి ఓ గొర్రెను ఎత్తుకెళ్లిన చిరుత
జాడ కోసం అటవీశాఖ గాలింపు

Baswapur | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ శివారులో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. శనివారం గొర్రెలను మేపుతున్న సమయంలో చిరుత ఒక్కసారిగా గొర్రెల మందపై దాడి చేసి ఓ గొర్రెను ఎత్తుకెళ్లినట్లు కాపరులు తెలిపారు. ఈ ఘటనతో కాపరులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చిరుత పాదముద్రలను పరిశీలించారు. పాదముద్రల ఆధారంగా చిరుత సంచరించిన ప్రాంతాన్ని గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు.

చిరుత జాడ కోసం అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు. చిరుత కనిపించిన వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.