Temple Accident | భర్త కళ్లెదుటే జరిగిన ఘటనతో విషాదం

Temple Accident |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కలుగుమలైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సౌత్ తిట్టన్‌కుళం ప్రాంతానికి చెందిన అనిత (24)కు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సురేశ్ (29)తో గత నెలలోనే వివాహమైంది. ఇటీవల సెలవుపై స్వదేశానికి వచ్చిన సురేశ్‌తో కలిసి అనిత కలుగుమలైలోని కలుగసాలమూర్తి ఆలయాన్ని దర్శించుకుంది. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇద్దరూ కొండపై ఉన్న ఉచ్చిపిళ్లైయార్ ఆలయానికి వెళ్లారు.

అక్కడ కోతులకు పండ్లు పెడుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కోతులు వారి చుట్టూ చేరినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అనిత కంగారులో అదుపుతప్పి కొండపై నుంచి కిందపడిపోయిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

భార్య కళ్లెదుటే ఈ ప్రమాదం జరగడంతో భర్త సురేశ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న కలుగుమలై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.