ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నల్గొండ , ఆంధ్ర ప్రభ : మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు అన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ఎన్.జి. కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు 2 కిలోమీటర్ల రన్ (2K Run) నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించి, విద్యార్థులు, యువత, పోలీసు అధికారులు ప్రజలతో కలిసి రన్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు.

మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని,ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతుందని అన్నారు. యువత ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పదంగా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, ఈ విషయంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ 2కే రన్ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, “డ్రగ్ ఫ్రీ నల్గొండ – డ్రగ్ ఫ్రీ తెలంగాణ” లక్ష్యంతో సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కృష్ణవేణి, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సైదా బాబు, శివ ప్రసాద్, ఐసిడిఎస్ అధికారులు నాగిరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.