పోలీసులు, రెవెన్యూ శాఖ సమక్షంలో కూల్చివేత

ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం చర్యలు

కలెక్టర్ ఆదేశాలతో ప్రోక్లేన్ సాయంతో ఇల్లు తొలగింపు
పొనకల్ గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ వెలుగులోకి
గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఉపేక్షించబోమన్న తహసీల్దార్
అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం
ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు

జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి నిర్మించిన ఇంటిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు శనివారం రెవెన్యూ అధికారులు, పోలీసులు సమక్షంలో తొలగించారు.

తొలుత ఇంట్లో ఉన్న వస్తు సామగ్రిని సురక్షితంగా బయటకు తరలించిన అనంతరం ప్రోక్లేన్ సాయంతో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అనంతరం శిథిలాలను కూడా తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం, పొనకల్ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 374లో 5 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో దుర్గం లక్ష్మి అనే మహిళ అక్రమంగా ఆక్రమణకు పాల్పడి, సిమెంట్ ఇటుకలు మరియు రేకులతో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లు, షెడ్లు నిర్మిస్తున్నారని గ్రామానికి చెందిన కొందరు ఇటీవల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో పాటు స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో స్థానిక తహసీల్దార్ డి. బక్కయ్య, ఎమ్మారై వెంకటేశం సూచనల మేరకు, జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు కల్పించారు. జీపీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ప్రోక్లేన్ సహాయంతో అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించారు.

ఈ విషయమై తహసీల్దార్ డి. బక్కయ్య మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మించిన ఇంటిని నిబంధనల ప్రకారం తొలగించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.