అల్లుడి హత్యకు పథకం.. రూ.10 లక్షల సుపారీతో హత్యాయత్నం
కాటారం, ఆంధ్రప్రభ: చిగురు గణేష్‌ను హత్య చేయించేందుకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి హత్యాయత్నానికి కుట్ర పన్నిన కేసులో ఐదుగురు నిందితులను కాటారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ అత్త చింత రాజేశ్వరి తన కుమార్తె మరణానికి అల్లుడే కారణమని భావించి దరంసోత్ రవీందర్ నాయక్‌కు రూ.10 లక్షలకు సుపారీ ఇచ్చి, అడ్వాన్స్‌గా రూ.1 లక్ష చెల్లించింది. అనంతరం రవీందర్ నాయక్ తడగొండ దామోదర్, కొలపాక నాగార్జున్, పోలు ప్రశాంత్‌తో కలిసి హత్యకు పథకం రచించాడు.
కారు చెడిపోయినట్లు నమ్మించి సహాయం కోసం వచ్చిన చిగురు గణేష్‌పై కొలపాక నాగార్జున్ కత్తితో దాడి చేశాడు. అయితే బాధితుడు పెద్దగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మిగిలిన సుపారీ డబ్బు తీసుకునేందుకు నిందితులు సమావేశమైన సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురినీ అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన కాటారం సీఐ ఈ. నాగార్జునరావు, ఎస్సైలు సీహెచ్. శ్రీనివాస్, జె. మహేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని కాటారం ఎస్డీపీఓ ఏ. సూర్యనారాయణ అభినందించారు.
