రోడ్డెక్కిన జొన్న రైతులు..
- రెండు నెలలుగా కొనుగోళ్లలో జాప్యం
- అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన
- జాతీయ రహదారి పై రాస్తారోకో
- మద్దతు తెలిపిన సిపిఎం
రామాయంపేట, ఆంధ్రప్రభ : జొన్నల కొనుగోళ్లలో జాప్యం కారణంగా విసుగుచెందిన రైతులు రోడ్డెక్కారు. కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనల చేపట్టిన రైతులకు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని క్యాట్రియాల, దంతాపల్లి, పర్వతాపూర్ కు చెందిన రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.
పంట మార్పిడి చేయమన్న ప్రభుత్వమే ఇప్పుడు జొన్నల కొనుగోళ్లు నిలిపివేయడం, లోడ్ చేసిన లారీలను వెనక్కి పంపడం దారుణమన్నారు. కొనుగోళ్లలో ఆలస్యం వల్ల చేతికి డబ్బులు అందక, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రామాయంపేట మార్కెట్ యార్డు ఎదురుగా జాతీయ రహదారి పై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నీలం బాబు ఉన్నారు.
