పేదలకు ఆసరా ‘ముఖ్యమంత్రి సహాయనిధి’..

మేడ్చల్, ఆంధ్రప్రభ : వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకం పేద ప్రజలకు కొండంత ఆసరాగా నిలుస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌కు చెందిన ఉనిగొర్ల నాగమల్లయ్య అనే లబ్ధిదారునికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా మంజూరైన రూ. 49,500ల చెక్కును ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ… అనారోగ్యంతో బాధపడుతూ, భారీ వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ పథకం ఒక వరంగా మారిందని కొనియాడారు. ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఇటువంటి సదుపాయాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, నర్సింగ్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ఇతర ముఖ్య నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.