వన్యప్రాణిని వేటాడిన నలుగురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

కడెం, ఆంధ్రప్రభ : రహస్య సమాచారం మేరకు కడెం మండలంలోని ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని ఇస్లాంపూర్ గ్రామంలో నిర్వహించిన సోదాల్లో సాంబార్ జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంటల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఆయన వివరాల ప్రకారం.. ఈ నెల 24న అటవీ శాఖ అధికారులు కనక లక్ష్మణ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా సాంబార్ జింక మాంసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం కనక లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన ముచ్చినేని రాము, ఉత్కూరి లచ్చన్న, ముచ్చినేని చిన్నులుతో కలిసి మొత్తం నలుగురు కుక్కల సహాయంతో అడవిలో సాంబార్‌ను వేటాడి చంపి, మాంసాన్ని గ్రామానికి తీసుకువచ్చినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు.

నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద ఈ నెల 25న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ నలుగురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెల్లడించారు.

వన్యప్రాణులను వేటాడడం, వాటి మాంసాన్ని విక్రయించడం, అటవీ సంపదను అక్రమంగా తరలించడం, అటవీ భూములను ఆక్రమించడం వంటి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని గంటల శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన డీఆర్ఓ అఫిజోద్దీన్, ఎఫ్‌ఎస్‌ఓ పాండురంగ్, ఎఫ్‌బీఓలు సునీల్‌కుమార్, రాజరాజేశ్వరితో పాటు బేస్ క్యాంప్ బృందాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంటల శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు.