మాదకద్రవ్యాల మాఫియాపై ఉక్కుపాదం..!

  • నషా ముక్త్ భారత్‌కు నాంది..!
  • అమిత్ షా కొత్త వ్యూహం!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. డ్రగ్ మాఫియాపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ‘నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026-2029’ను విడుదల చేశారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా ఆధారిత, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, నెట్‌వర్క్ కేంద్రిత వ్యూహాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు.

న్యూఢిల్లీలో జరిగిన 10వ నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేస్తే డ్రగ్స్ నిర్మూలనలో గణనీయమైన ఫలితాలు సాధించవచ్చన్నారు.

డ్రగ్ స్మగ్లర్లపై ఎలాంటి కనికరం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మాదకద్రవ్యాలకు బానిసైన యువత పట్ల సానుభూతితో వ్యవహరించి వారిని పునరావాసం వైపు నడిపించాలన్నారు.

ఈ సందర్భంగా ఎన్‌సీబీ వార్షిక నివేదిక-2025ను కూడా విడుదల చేసిన అమిత్ షా.. జమ్మూ, గువాహటిలో కొత్తగా నిర్మించిన ఎన్‌సీబీ జోనల్ కార్యాలయాలను ప్రారంభించారు. అలాగే ‘ఆన్‌లైన్ డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’కు శ్రీకారం చుట్టారు. ఒకే రోజులో రూ.12,525 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ధ్వంసం చేసినందుకు సంబంధిత సంస్థలను అభినందించారు.

కేంద్ర హోంశాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, డ్రగ్స్ నియంత్రణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సమన్వయంతో పనిచేసే కార్యాచరణపై చర్చించారు.

కొత్త విజన్ డాక్యుమెంట్‌లో సింథటిక్ డ్రగ్స్, డార్క్‌నెట్ ద్వారా జరుగుతున్న డ్రగ్ ట్రాఫికింగ్ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాకుండా డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు, చికిత్స, పునరావాస సేవలను మరింత బలోపేతం చేసే కార్యాచరణను కూడా ఇందులో పొందుపరిచారు. “నషా ముక్త్ భారత్” లక్ష్య సాధనకు ఈ విజన్ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.