ఖమ్మంలో అంతిమ యాత్ర రథం ప్రారంభం..

ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : ఖమ్మం పట్టణ ప్రజలకు మరింత గౌరవప్రదమైన అంతిమ యాత్ర సేవలను అందించాలనే లక్ష్యంతో హిందూ స్మశాన వాటికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన అంతిమ యాత్ర రథాన్ని శుక్రవారం కాల్వోడ్డు వైకుంఠధామంలో ఘనంగా ప్రారంభించారు.

దివంగత కామ్రేడ్ చావా వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, తిరుమలాయపాలెం పీఏసీఎస్ చైర్మన్ చావా వేణుగోపాల కృష్ణ సమాజ సేవా దృక్పథంతో తన డీసీఎం వాహనాన్ని హిందూ స్మశాన వాటికల నిర్వహణ కమిటీకి విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, మరణించిన వారి చివరి ప్రయాణం కూడా గౌరవప్రదంగా జరగాలని, ఆ లక్ష్యానికి ఈ అంతిమ యాత్ర రథం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో కలిసి చివరి వీడ్కోలు తెలిపేందుకు ఈ వాహనం ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సేవను సమాజానికి అంకితం చేసిన చావా వేణుగోపాల కృష్ణను కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో హిందూ స్మశాన వాటికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సీఏ రాయపూడి రంగనాథ్, ఉపాధ్యక్షుడు పుల్లఖండం నాగేందర్‌రావు, కార్యదర్శి రాయపూడి అనంత పద్మనాభం (రిటైర్డ్ సీఎస్/సీఈ), సభ్యులు పెనుగొండ శ్రీనివాసరావు, బజ్జూరి రమణారెడ్డి, గౌరవ సలహాదారులు డోకుపర్తి రవీంద్రకుమార్, ఉదారపు కిరణ్‌కుమార్, సామాజిక సేవకులు వి.వి. చౌదరి, ఆనందరెడ్డి, వి. నర్సయ్య, పగడాల నాగేశ్వరరావు, ఎర్రా రమేష్, హిందూ స్మశాన వాటిక సిబ్బంది, ఖమ్మం నేత్రనిధి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, దాతలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, సమాజానికి అవసరమైన ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు.