South Asian | రాక్‌బాల్ టోర్నీకి పూడూరు యువకుడు..!
మేడ్చల్, ఆంధ్రప్రభ : నేపాల్ రాజధాని ఖాట్మండు వేదికగా జూన్ 27 నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న మొదటి దక్షిణాసియా రాక్‌బాల్ టోర్నమెంట్’ లో పాల్గొనే భారత జాతీయ జట్టుకు మేడ్చల్ జిల్లా, పూడూరు పట్టణానికి చెందిన యువకుడు గోపాల్ యాదవ్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో ఆయన కనబరిచిన అద్భుత ప్రతిభ ఆధారంగా జాతీయ సెలెక్టర్లు గోపాల్ యాదవ్‌ను ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే సువర్ణ అవకాశం రావడం పట్ల గోపాల్ యాదవ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాక్‌బాల్ క్రీడలో భారతదేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక గ్రామీణ ప్రాంతం నుండి ఒక యువకుడు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పూడూరు గ్రామంతో పాటు మేడ్చల్ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గోపాల్ యాదవ్‌ను ఆయన స్నేహితులు, క్రీడాభిమానులు, గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఘనంగా అభినందించారు. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయం సాధించాలని, గోపాల్ యాదవ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
