Experts | బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?

Experts | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బాదం పప్పులు మన రోజువారీ ఆహారంలో ఎంతోకాలంగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగంగా తీసుకోవడం నుంచి తీపి, కారం వంటకాలకు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అయితే, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సందేహం తరచూ వినిపిస్తుంది. బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

ఎండాకాలంలో బాదం పప్పులు తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, వేడి వాతావరణంలో అసౌకర్యం కలుగుతుందని భావించి చాలామంది వాటిని తినడానికి వెనుకాడుతుంటారు. అయితే ఈ అభిప్రాయానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

అపోహ ఎలా వచ్చింది?

బాదం పప్పులు శరీరంలో వేడిని పుట్టిస్తాయనే నమ్మకం వాటి పోషక విలువల కంటే, కొన్ని ఆహార పదార్థాలపై ప్రజల్లో ఉన్న సంప్రదాయ భావనల నుంచే వచ్చింది. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పీచు పదార్థం అధికంగా ఉండటంతో ఇవి బరువైన ఆహారమని, అందుకే శరీరంలో వేడి పెరుగుతుందని కొందరు భావిస్తుంటారు.

అయితే వేసవిలో బాదం పప్పులు తినకూడదని చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవు. వయసు, జీవనశైలితో సంబంధం లేకుండా సమతుల్య ఆహారంలో భాగంగా ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ బాదం పప్పులను తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమాద్దర్ మాట్లాడుతూ, ఉదయం దినచర్యను ఎలా ప్రారంభిస్తామనేది రోజంతా శరీరం పనిచేసే తీరుపై ప్రభావం చూపుతుందని తెలిపారు. సరైన పోషణతో కూడిన సమతుల్య ఆహారం శక్తి స్థాయిలు, జీర్ణక్రియ, దీర్ఘకాలిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు. రోజువారీ ఆహారంలో పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్స్‌ను చేర్చుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులభమైన మార్గమని వివరించారు.

పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్

కాలిఫోర్నియా బాదం పప్పుల్లో విటమిన్–ఇ, ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, ఫాస్పరస్, జింక్ సహా 24 రకాల పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాల కారణంగా బాదం ఆధునిక జీవనశైలికి అనువైన సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందింది.

బాదంలో ఉండే ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ శరీరానికి నిరంతర పోషణను అందించడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. అందుకే పగటి సమయంలో తినేందుకు బాదం మంచి ఎంపికగా భావిస్తారు.

పూర్తిగా ప్రాసెస్ చేసిన ఆహారం తిన్నప్పుడు శక్తి స్థాయిలు ఒక్కసారిగా పెరిగి త్వరగా తగ్గిపోతాయి. కానీ బాదం పప్పులు శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. పని చేస్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, చురుకైన జీవనశైలిలో ఉన్నప్పుడు కూడా అవసరమైన పోషణ అందిస్తాయి.

యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రోజూ 43 గ్రాముల డ్రై రోస్ట్ చేసిన, కొద్దిగా ఉప్పు చల్లిన బాదం పప్పులు తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. అలాగే శరీర బరువు పెరగకుండా విటమిన్–ఇ, మోనోశాచురేటెడ్ మంచి కొవ్వులు అందుతాయి.

బాదం నానబెట్టి తినాలా?

బాదం పప్పులను నానబెట్టి తినాలా లేదా అనేది చాలామందికి ఉండే సందేహం. నానబెట్టిన బాదం మృదువుగా ఉండి నమలడానికి సులభంగా ఉంటుంది. అయితే నానబెట్టడం అనేది వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయం మాత్రమే. పోషకాల పరంగా నానబెట్టినా, నానబెట్టకపోయినా పెద్ద తేడా ఉండదు. రెండు విధాలా కూడా అదే పోషకాలు లభిస్తాయి.

రోజువారీ ఆరోగ్యానికి బాదం

బాదం పప్పులు ప్రొటీన్‌కు మంచి వనరు. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో, కండరాల పెరుగుదల, సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ప్రొటీన్ అవసరం.

బాదంలో ఉండే మెగ్నీషియం కండరాలు, నరాలు సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అల్పాహారంలో, వ్యాయామం తర్వాత, కుటుంబ వేడుకల్లో కూడా బాదం పప్పులను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.

ముగింపు

బాదం పప్పులు శరీరంలో వేడిని పుట్టిస్తాయనేది శాస్త్రీయ ఆధారాలు లేని ఒక సాధారణ ఆహారపు అపోహ మాత్రమే. వాస్తవానికి బాదం పప్పులు పోషకాలతో నిండిన ఉత్తమ ఆహారం. సమతుల్య జీవనశైలిలో భాగంగా ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ వీటిని తీసుకోవచ్చు.

బాదం పప్పులు “వేడి” చేస్తాయా లేదా “చలువ” చేస్తాయా అనే చర్చ కంటే, అవి అందించే పోషక విలువలపై దృష్టి పెట్టడం మంచిది. ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్–ఇ, మెగ్నీషియంతో సమృద్ధిగా ఉండే కాలిఫోర్నియా బాదం పప్పులు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు రోజువారీ ఆరోగ్యానికి అవసరమైన పోషణను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.