మృత్యుపాశాలుగా మారిన నిరుపయోగ బావులు..

  • నిత్యం భయం గుప్పిట్లో స్థానికులు..
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో వాగు సమీపంలోని ప్రధాన కూడలి వద్ద రహదారికి కుడి, ఎడమ వైపులా ఉన్న రెండు నిరుపయోగ బావులు ప్రజలకు, వాహనదారులకు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ అవసరాల కోసం తవ్విన ఈ బావులు ప్రస్తుతం వినియోగంలో లేకపోయినా వాటిని పూడ్చివేయకపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన కూడలికి సమీపంలో, జనావాసాల మధ్య ఉన్న ఈ రెండు బావులకు ఎలాంటి రక్షణ కంచె, ప్రహరీ గోడ లేదా హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో రోడ్డుపై ప్రయాణించే ప్రజలు, వాహనదారులు ప్రమాదవశాత్తు బావుల్లో పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

ప్రతి రోజు ఈ మార్గంలో విద్యార్థులు నడుచుకుంటూ, సైకిళ్లపై పాఠశాలలకు వెళ్తుంటారని, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బావుల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో రెండు ప్రమాదాలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు.

బావుల పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోవడం, చెత్తాచెదారం పేరుకుపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

“ఈ ప్రమాదకర బావుల గురించి పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదు. కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఏదైనా ఘోర ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూస్తారా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

ప్రాణనష్టం జరగకముందే అధికారులు స్పందించి, ఈ రెండు బావుల చుట్టూ వెంటనే ప్రహరీ గోడలు నిర్మించాలని లేదా శాశ్వతంగా పూడ్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.