TGICCC | మేఘాలయ సీఎం సంగ్మా ప్రశంసలు

హైదరాబాద్‌లోని టీజీఐసీసీసీని సందర్శించిన కాన్రాడ్ కె. సంగ్మా
తెలంగాణ నమూనాలోనే మేఘాలయలో ఏర్పాటు చేస్తామని వెల్లడి

TGICCC | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) పనితీరును మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసించారు. శుక్రవారం కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అత్యాధునిక సాంకేతికత, డేటా ఆధారిత వ్యవస్థలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ఈ కేంద్రం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.

శుక్రవారం తెలంగాణ పోలీసుల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన కాన్రాడ్ కె. సంగ్మా, అక్కడ అమలవుతున్న సాంకేతిక వ్యవస్థలు, అత్యవసర స్పందన విధానం, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయ ప్రక్రియలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. కేంద్రం పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సంగ్మా, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దేశంలోనే అత్యుత్తమ నమూనాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. సాంకేతికత, డేటా విశ్లేషణ, వివిధ శాఖల సమన్వయాన్ని సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

తెలంగాణలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, మేఘాలయలో కూడా ఇదే తరహాలో అత్యాధునిక ‘టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్’ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పాలన, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, మెరుగైన పౌర సేవలను అందించేందుకు ఈ తరహా సాంకేతిక వ్యవస్థలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

టీజీఐసీసీసీలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను తమ రాష్ట్రంలో సాధ్యమైనంత మేర అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కాన్రాడ్ కె. సంగ్మా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత పాలనా విధానాలు ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఆయన కొనియాడారు.