విద్యుత్ స్తంభానికి అల్లుకుపోయిన చెట్టు..

  • తరచూ కరెంటు కోతలు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రామయ్యగూడ రహదారిపై ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఓ చెట్టు అల్లుకుపోవడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలను తాకడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయని వారు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, విద్యుత్ స్తంభానికి అల్లుకున్న చెట్టు కొమ్మలను తొలగించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.