ఘనంగా శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్ప స్వామి 15వ వార్షికోత్సవo..
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయ పంచదశ (15వ) వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం మేళతాళాల నడుమ దేవాలయ ముఖద్వారానికి మామిడి తోరణాల అలంకరణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహోన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తదితర విశేష పూజలు నిర్వహించారు. కీర్తిశేషులు వెంకటేశ్వర్లు–ప్రమీల నివాసం నుంచి స్వామివారి పట్టు వస్త్రాలతో శోభాయాత్రను నిర్వహించారు.
ఉదయం 9 గంటల నుంచి సహస్రనామార్చన, విశేష అలంకరణలు, శ్రీలక్ష్మీ గణపతి, రుద్ర, మూలమంత్ర హోమాలు, మహాపూర్ణాహుతి, అవభృతం, మహాదాశీర్వచనం, తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. స్వామివారి గ్రామోత్సవం, శోభాయాత్ర భక్తుల జయజయధ్వానాల మధ్య అత్యంత వైభవంగా సాగింది.
ఈ పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ రాయప్రోలు భద్రయ్య శర్మ, శ్రీరామయ్య శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. కీతవారిగూడెం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు, అయ్యప్పస్వాములు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల విజయవంతానికి ఆలయ కమిటీ సభ్యులు, దాతలు విశేషంగా సేవలందించారు.
