రేపటితో చౌటుప్పల్ లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి..
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక దృష్టితోనే విజయవంతం
- వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు రేపటితో సంపూర్ణంగా ముగియనున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అంకిరెడ్డిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడి కొనుగోళ్ల సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని దాదాపు అన్ని ధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి ప్రస్తుతం లోడింగ్ ప్రక్రియ నడుస్తోందని, మిగిలిన అంకిరెడ్డిగూడెం సెంటర్ రేపటితో ముగియనుందని పేర్కొన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ఈ ప్రక్రియ వేగంగా సాగిందని కొనియాడారు.
గోదాముల లభ్యతతో తీరిన ఇబ్బందులు
“ఈసారి ఎన్నడూ లేని విధంగా మండలంలో భారీగా ధాన్యం దిగుబడి వచ్చింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిరంతరం అధికారులను, నాయకులను అప్రమత్తం చేస్తూ.. ధాన్యం నిల్వలకు అవసరమైన ఏఎంసీ, అంకిరెడ్డిగూడెం, మల్కాపురం, ధర్మోజీగూడెంలలో ప్రత్యేకంగా గిడ్డంగులను (గోదాంలు) ఏర్పాటు చేయించారు.
” ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడానికి నిరంతరం సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి, క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడిన మునుగోడు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వివిధ శాఖల అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు, సహకరించిన రైతులందరికీ ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
