డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం..

  • యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండి విద్య, ఉపాధి, లక్ష్యసాధనపై దృష్టి సారించాలని సూచించారు.

డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.