చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింతగూడెం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగారం గ్రామానికి చెందిన మట్టి మహేష్ (23), సర్వాయి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.